Saturday, March 30, 2013

ఇంకా యెన్నాళ్ళు - గజల్ - బి. ఇందిర(ఇల్లందు)


బి. ఇందిర(ఇల్లందు)

మనిషిని మనిషే చంపే వాదం - ఇంకా యెన్నాళ్ళు
ఏ పరమార్థం కోరని క్రోథం - ఇంకా యెన్నాళ్ళు!


సాంత్వన తీర్చే సాయం సంధ్యలు పలికే గీతికలో
నరాలు తెంపే విషాద నాదం యింకా యెన్నాళ్ళు

ద్వేషం అంటే తెలియని ఆశా జీవులె అందరూ
అమాయకులపై హింసా వాదం యింకా యెన్నాళ్ళు

పేరేదైనా మానవ జాతికి వేరొకటి కాదా
మనుగడ కొమ్మన మనలో బేధం యింకా యెన్నాళ్ళు

రేపటి వేకువ కోసం సాగే అడుగులు ఇందిరా
పొంచిన మృత్యువు ఆడే జూదం యింకా యెన్నాళ్ళు


30.3.2013

Monday, March 25, 2013

ఒక కల - పద్మ అర్పిత గజల్



పద్మ అర్పిత గారి రచన

అధ్భుతమైన చిత్రాన్ని గీయాలని ఒక కల
ఆ చిత్రంలో జీవకళ ఉట్టిపడాలని ఒక కల

మంచి కవిత వ్రాయాలని
నా భావాలన్నీ అందులో పొందుపరచాలని ఒక కల.

మధురమైన గేయం రచించాలని
ఆ పాటతో అందరూ పరవశించిపోవాలని ఒక కల.

ఎంతో ఉన్నతంగా జీవించాలని
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని ఒక కల.

అజ్ఞాతంగా అంతమైపోవాలని
అంతమై అందరిలో జీవించాలని ఒక కల.

వికసించిన "పద్మ"మైపోవాలని
పదములు నడిపే పాదాలుచేరాలని ఒక కల.