Sunday, February 3, 2013

నీ కోసం - జగన్నాద వడిమెళ్ళ


మనసుమాట మగరాజ తెలుసుకో నీ కోసం
మదిరాజ్యాన్ని మహారాజా ఏలుకో నీ కోసం

కన్నుల్లోని కలలు. బుగ్గల్లోని కెంపులు.
పెదాల ఎరుపులు ఎదలో మమతలు..నీ కోసం

తనువు తహతహలు తలపు తలగడలు
వలపు వింజామరలు ప్రాయపు పకపకలు..నీ కోసం

నదుల గలగలలు జతుల లయతళాలు
శబ్దాల తరంగాలు గతుల గమకాలు..నీ కోసం

పైటల విసురులు సోకుల సొబగులు..నీ కోసం
పయ్యెదల పిలుపులు సోయగాల సకిలింపులు..నీ కోసం

రూప విలాసాలు దీప కాంతిరేఖలు.
ధూప పరిమళాలు మది మురిపాలు..నీ కోసం

హృదిలో సరాగాలు కళ్ళల్లో మెరుపులు
తరుణి తమకాలు. గదిలో పాలగ్లాసు..నీ కోసం

వయసు దివిటీలు మనసు మతాబులు
వెన్నెల వెలుగులు చెలిమి చిచ్చుబుడ్డీలు..నీ కోసం

చెవుల లోలకులు ముక్కున ముక్కెరలు.
కొప్పున కొండమల్లెలు నడుము నయగారాలు..నీ కోసం

జాబిలి పాడిన జావళి జామురాతిరి జాగారం
జలధి అందించే ముత్యాలు జవ్వని మదన సింగారాలు..నీ కోసం

ముద్దుకో ముద్దు మమతల సద్దు
పసిడికిరణాల పొద్దు సమాజాంక్షలు రద్దు..నీ కోసం

నా మది నీదని నీకింత అలుసా
విసురజ మనసులోని మాటలమూత నీ కోసం

**********
జగన్నాద వడిమెళ్ళ - గీతాంకు - ఘజల్ రూపం