Wednesday, June 11, 2014

ఆ రాత్రి - జాన్ హైడ్ కనుమూరి గజల్


కలలోనైనా మెలకువనైనా గుర్తుండేదీ ఆ రాత్రి
నీతో నడచీ అలుపును మరచీ సాగినదీ ఆ రాత్రి
నిన్ను నన్నూ కలిపినదెవరో తెలిసేలోగా 
కాలం పరిచిన తిన్నెలపై వెన్నెల పరచినదీ ఆ రాత్రి
నిట్టూర్పు సెగలతో క్షణాలు యుగాలుగా
నీకై వేచివున్న మదిగదిని రెప్పవేయనిదీ ఆ రాత్రి
శిశిరానికి ఆకురాలిన కొమ్మను నేనై
పొటమరింతల చిగురుకై ప్రసవవేదనైనదీ ఆ రాత్రి
హోరు గాలిలోచిక్కి ఒంటరైన పక్షికి
దిగులుగా గుబులు గుబులుగా గడచినదీ ఆ రాత్రి
కలలుకన్న తనువున నిదురనే తరిమి
వేలవేల వీణెలు మీటిన సంగీతమైనదీ ఆ రాత్రి
ఎదురెదురు రేవులలో కలవలేని కనులుగా
దరి చేరని నది అలలపై ఊగి ఊగి సాగినదీ ఆ రాత్రి
అప్పగింతల పర్వమే తెగిన శాశ్వత బంధంగా
తలచి తలచి వర్షించే కనులతో తడిసినదీ ఆ రాత్రి
నెలరాజునిండిన తోటలో రేయంతా పాటగా
కూజానువొంపిన గజళ్ళతో కడుపు నిండినదీ ఆ రాత్రి